వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి

  • వైఎస్ కుటుంబంలోని మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్
  • జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీటెక్ రవి
  • 1962లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని వెల్లడి
  • తమకు అడ్డు వచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుపెట్టిందన్న రవి
  • జగన్ తన గత చరిత్ర తెలుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు 

వైసీపీ అధినేత జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి ఘాటుగా స్పందించారు. వైఎస్ కుటుంబంలో మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్ ఆరోపణలను తిప్పికొడుతూ... ఆ కుటుంబానిది హత్యల చరిత్ర అంటూ పాత విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. వైఎస్ కుటుంబంలో ఓటమి చరిత్ర ఆనాడే మొదలైందని, 1968లో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి భార్య జయమ్మ పులివెందుల సర్పంచ్‌గా పోటీ చేసి, వార్డు మెంబర్‌గా ఉన్న కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, 1962లోనే పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని ప్రస్తావించారు.


రాజకీయంగా, వ్యాపారపరంగా తమకు అడ్డువచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుబెట్టిందని బీటెక్ రవి తీవ్ర ఆరోపణలు చేశారు. నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను, అలాగే త్రివేణి స్టీల్స్ పెట్టి ఎదుగుతున్న వ్యక్తిని కూడా హత్య చేయించిన చరిత్ర వారిదేనని దుయ్యబట్టారు. మంగంపేట బెరైటీస్‌ను అక్రమంగా సొంతం చేసుకుని, ఆ ఆదాయంతోనే జగన్ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించిందన్నారు. రాజారెడ్డి చెబితేనే మురళీమోహన్‌రెడ్డిని గంగిరెడ్డి, బాబుల్‌రెడ్డిలు హత్య చేశారని, ఇలాంటి అరాచకాల వల్లే విధిలేని పరిస్థితుల్లో రాజారెడ్డి హత్య జరిగిందని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అరాచకాలే సూత్రాలుగా బతికే జగన్... వారి కుటుంబ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.


జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్తే ఎంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడినైనా బతకనిచ్చేవారు కాదని బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మద్దెలచెరువు సూరితో జగన్ కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయన్న ఆయన... జైలులో ఉండి ప్లాన్ చేసి మరీ పరిటాల రవిని హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీని విడిచిపెట్టి రాలేదనే ఏకైక కారణంతో పరిటాల రవిని పొట్టనపెట్టుకున్నారని, అంతకంటే ముందే ఆర్కే, ప్రభాకర్‌రెడ్డిలను కూడా చంపేసి ఆ తర్వాతే పరిటాల రవిని టార్గెట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలిసిన జగన్ క్రూరత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.


B.Tech Ravi
YS Jagan
YS Rajasekhara Reddy
Andhra Pradesh Politics
Pulivendula
TDP
YSRCP
Paritala Ravi Murder
Political Murders
Telugu Desam Party

More Telugu News