కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, ఆరుగురికి గాయాలు

Kodada Road Accident Six Injured in Bus Lorry Collision
  • సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ బస్సుకు ప్రమాదం
  • ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
  • కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
  • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, అదుపుతప్పి ముందున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి 'యోలా' (Yolo) ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. కోదాడ పట్టణ సమీపంలోకి రాగానే, ముందు వెళ్తున్న లారీని బస్సు అత్యంత వేగంగా ఢీకొట్టింది. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
Go Back to Shorts
KODADA ROAD ACCIDENT
Kodada
Road Accident
Suryapet
Yolo Travels
Bus Accident
lorry
Hyderabad
Kakinada

More Telugu News