: మందు మానాలనుకునే వారికో శుభవార్త...!
మీరు మద్యం తాగడం మానాలనుకున్నా మానలేకపోతున్నారా... అయితే ఈ వార్త మీకోసమే... ఈ కొత్తరకం మందును వాడడం వల్ల మీకు మందు తాగాలనే కోరిక తగ్గుతుందట. ఎందుకంటే, మీలోని మందు తాగాలనే కోరికను ఈ కొత్త మందు అదుపు చేస్తుందట.
మైకేల్ ఎస్.ఇర్విగ్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధన బృందం తాజాగా నిర్వహించిన పరిశోధనలో మనకు జుట్టు రాలకుండా నిరోధించేందుకు ఉపయోగించే ఒక మందుకు మద్యం తాగాలనే దురలవాటును మాన్పించే లక్షణం కూడా ఉన్నట్టు తేలింది. జుట్టు రాలకుండా నిరోధించేందుకు వాడే ఈ మందును తీసుకున్న వారిలో మద్యం తాగాలనే తృష్ణ తగ్గుతుందని మైకేల్ చెబుతున్నారు. ఫినాస్టరైడ్ (ప్రోఫెసియా) అనే మందును జుట్టు రాలకుండా నిరోధించేందుకు వాడుతారు. ఈ మందులోని ఫినాస్టరైడ్ మన మెదడులో ఉండే న్యూరోస్టెరాయిడ్స్ అనే కీలకమైన హార్మోను సాంద్రతను, గాఢతను తగ్గిస్తుందని, ఈ కారణంగా వారిలో ఆల్కహాలు తీసుకోవాలనే ఆకాంక్ష క్రమేపీ క్షీణిస్తుందని ఆయన చెబుతున్నారు.