: ఇది 'నారాయణ' స్టయిల్!
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రత్యేకత ఏంటని ప్రశ్నిస్తే.. ఎవరైనా సులభంగా జవాబు చెబుతారు, ఆయన వ్యంగ్యోక్తులు విసరడంలోదిట్టని. ఎవరినైనా, ఏ రీతిలోనైనా విమర్శించడంలో నారాయణ తర్వాతే ఎవరైనా. తాజాగా, కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించే విషయంలో ఆ పార్టీ ఊసరవెల్లిలా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంలో కాంగ్రెస్ కు స్పష్టత లోపించిందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీయే అడ్డు అని ఆడిపోసుకుంటున్న కాంగ్రెస్ నేతలు.. టీడీపీనే తెలంగాణకు అడ్డంకి అని స్పష్టంగా ప్రకటించాలని నారాయణ డిమాండ్ చేశారు. అప్పుడు తాము తెలంగాణ విషయమై చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే వీలుంటుందని చెప్పారు. పార్టీ నుంచి వలసలను అరికట్టేందుకే, కాంగ్రెస్ అధిష్ఠానం ప్యాకేజీలను తెరపైకి తెస్తోందని నారాయణ ఎద్దేవా చేశారు.