: సీఎం కిరణ్ ఎన్ని'కలల' దృష్టి!
సీఎం కిరణ్ కుమార్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పుడే ప్రచారం మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. ఈ నెలాఖర్లో స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రచార ప్రక్రియను ఇప్పుడే మొదలు పెడితే.. ఎలక్షన్ల నాటికి వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలమని సీఎం భావిస్తున్నట్టుంది. ఈ రోజు కృష్ణా జిల్లాలో జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే.. ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో కిరణ్ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు.
ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత తమదే అని చెప్పారు. ఈ చట్టాన్ని అనుసరించి ఇందిరమ్మ కలలు పథకాన్ని అమల్లోకి తెచ్చామని, దీంతో, ఎస్సీ ఎస్టీల జీవితాలనే మార్చేయగలమని ఆయన ధీమాగా చెప్పారు. ఇక ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కోసం రూ. 12, 251 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రైతుల కోసం రూ.72 వేల కోట్లు కేటాయించామని, మహిళలకు ప్రత్యేక పథకాలు తెచ్చామని సీఎం వివరించారు.