: ముంబైలో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆయుధాలు లభ్యం
ముంబై రేవు వద్ద తవ్వకాలు జరుపుతుండగా రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటివిగా భావిస్తున్న కొన్ని రకాల యుద్ధ సామగ్రి లభించింది. ఇవి మొత్తం పేలకుండా ఉండిపోయిన సామగ్రేనని రక్షణశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ డంపులో బాంబులు, క్షిపణులు, గ్రేనేడ్లు, తూటాలు ఇలా 90 రకాలకు చెందిన వస్తువులు దొరికాయి. ముంబై రేవులో భారీ రవాణా నౌకల రాకపోకలకు అనువుగా జలమార్గాన్ని విస్తృతం చేసేందుకు షిప్పింగ్ అధికారులు డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇవి బయటపడడంతో రక్షణశాఖాధికారులకు సమాచారమందించారు.
రెండు డ్రెడ్జర్లతో తవ్వకాలు జరుపుతుండగా ఈ డంపు బయటపడిందని రక్షణశాఖాధికారులు తెలిపారు. భారత నౌకాదళ ఆయుధగారానికి చెందిన నిపుణుల బృందం వీటన్నింటినీ నిర్వీర్యం చేసింది. ముంబై రేవు వద్ద పరిసరాల్లో అడపాదడపా ఇటువంటి ఆయుధ సామగ్రి బయటపడటం సాధారణమేనని, అయితే ఇంత పెద్దమొత్తంలో యుద్ధ సామగ్రి బయటపడడం వింతేనని అధికారులు తెలుపుతున్నారు.
ఈ ఆయుధాలు 1944లో జరిగిన భారీ విస్ఫోటానికి సంబంధించిన ఆయుధాలేనా అనే దిశగా అధికారులు విచారణ చేస్తున్నారు. 1944లో ఓ భారీ రవాణా నౌక అగ్నిప్రమాదానికి గురై పేలిపోయిందని అధికారులు తెలిపారు.