: బెట్టింగ్ ఉన్నట్టా? లేనట్టా? పోలీసులే ముద్దాయిలా?


ఐపీఎల్ ను ఓ కుదుపు కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లు తీరం దాటేశాయి. ఉవ్వెత్తున ఎగిసిన అలలా ఛప్పున చల్లారిపోతున్నాయి. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి. కుంద్రా అరెస్టుతో ఒక్కసారిగా మొత్తం స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం రివర్స్ గేరులో పోలీసులపైకి వచ్చిపడింది. అసలు పోలీసులు పక్కాగా పట్టుకున్నారా? బెట్టింగ్, ఫిక్సింగ్ రెండింటిని కలగాపులగం చేసేసిన పోలీసులు నెత్తికోట్టుకుంటున్నారా? సెలబ్రటీలు పాత్రధారులు కావడంతో క్రికెట్ లో అవినీతి వ్యవహారం నీరుగారిపోతోందా? అసలింతకీ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం ఎక్కడకి పయనిస్తోంది.

ఢిల్లీ పోలీసుల చలువతో స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బట్టబయలైంది. వీరితోపాటు ముంబై పొలీసులు చొరవ చూపడంతో బుకీల బండారం బయటపడింది. దీంతో క్రికెటర్లు, బుకీలు, కోర్టులు, పోలీసులు అంటూ చకచకా నెలరోజులు గడిచిపోయాయి. ఇక్కడే కేసులు పలు మలుపులు తిరిగాయి. కేవలం ఆటమాత్రమే తెలిసిన ఆటగాళ్లు తాము నిర్ధోషులమంటూ పాడినపాటే పాడారు. కానీ, ఢక్కా మొక్కీలు తిని తెగబలిసిన బుకీలు మాత్రం నోరు విప్పలేదు. ఏం జరగదు అన్నంత ధీమాగా తమ పని తాము చేసుకుపోయారు. వీరి లింకులన్నీ బడాబాబులతో కావడంతో చకచకా చక్రంతిప్పారు. నెలలోనే బయటపడిపోయారు. అసలు కోర్టు వెనుక ఏం జరిగింది?.

క్రికెటర్ల అరెస్టుతో రసకందాయంలో పడిన ఐపీఎల్ ఫిక్సింగ్ మరకలంటిన క్రికెటర్లను బీసీసీఐ ఆఘమేఘాలమీద సస్పెండ్ చేసేసింది. అనంతరం ఫిక్సింగ్ పలు మలుపులు తిరిగింది. గురునాథ్ మెయ్యప్పన్ పేరు బయటపడి, పోలీసుల డెడ్ లైన్ గడిచిన 36 గంటల తరువాత అన్నీ చక్కబెట్టుకుని ధీమాగా మెయ్యప్పన్ పోలీసు కస్టడీకి వెళ్లిన తరువాత మరింత రసవత్తరంగా మారింది. గురునాధ్ పట్టుబడడంతో అతని మామ శ్రీనివాసన్ పై అన్ని వైపులనుంచి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగింది. అయినా దున్నపోతుమీద వాన పడ్డట్టు అస్సలు చలించని శ్రీనివాసన్ ధీమాగా తన పదవిని అట్టిపెట్టుకున్నాడు.

దాల్మియాను తెరముందు పెట్టి తెరవెనుక చక్రం తను నడిపించాడు. దీంతో అంతవరకూ కెమెరాల ముందు ముఖాలు కప్పుకుని దొంగల్లా, నంగిగా నిలబడ్డ బుకీలు అడ్డం తిరిగారు. తామేతప్పు చేయలేదన్నారు. పోలీసులే తమను అడ్డంగా ఇరికించారని, హింసించారని అన్నారు. చిరవకు సురక్షితంగా జైలునుంచి విడుదలయ్యారు. ఇప్పుడు క్రికెటర్లకు మరింత వెసులుబాటు దొరికింది. తాము అన్యాయమైపోయామని, అకారణంగా ఇరికించారని కడిగిన ముత్యాల్లా వస్తామని మీడియాముందు శపధాలు చేసేశారు.

ఇప్పుడే అసలు కధ మొదలైంది. ఇంతకూ ఫిక్సింగ్ జరిగిందా? లేదా? బుకీలు బెట్టింగ్ లు చేసుకోవడం తప్పుకాదా? పూర్తి సాక్ష్యాధారాలున్నాయన్న పోలీసులు కోర్టుకు సమర్పంచలేదా? లేక కోర్టుకు సమర్పించడానికి సాక్ష్యాలు సేకరించలేదా? ఇంతకీ ఈ ఫిక్సింగ్ వ్యవహారం వల్ల ఎవరికి లాభం. ఎవరికి నష్టం కలిగింది? అని క్రీడాభిమానులు, విశ్లేషకులు తలలు పగలుగొట్టుకుంటున్నారు. ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహంతో బెట్టింగ్, ఫిక్సింగ్ రెండూ పసలేకుండా పోతున్నాయని నిపుణులు మండిపడుతున్నారు. రెంటినీ వేరు వేరుగా చూడకుండా కలిపి అదర్నీ ఒకేగాటన కట్టడంతో కేసులు నీరుగారిపోతున్నాయంటున్నారు. దీనివల్ల పోలీసుల ప్రతిష్ఠ మంటగలుస్తుందని వారి నాణ్యతపై నమ్మకం పోతుందని అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News