టర్కీలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్... భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నటి ప్రగతి

  • టర్కీ వేదికగా జరుగుతున్న టోర్నీలో పాల్గొంటున్న నటి ప్రగతి
  • పవర్‌లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వైనం
  • 2023 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వరుస పతకాల సాధన
  • ఇటీవల కేరళలో జరిగిన జాతీయ పోటీల్లోనూ స్వర్ణ పతకం కైవసం
  • నటనతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రగతి
తెలుగు ప్రేక్షకులకు తల్లి, అత్త పాత్రలతో సుపరిచితురాలైన ప్రముఖ నటి ప్రగతి, వెండితెరపైనే కాకుండా క్రీడారంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. పవర్‌లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆమె, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. రేపు (ఆదివారం) టర్కీలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో ప్రగతి భారతదేశం తరఫున పోటీ పడనున్నారు. నటిగా అశేష ప్రేక్షకాదరణ పొందిన ఆమె, ఇప్పుడు పవర్‌లిఫ్టర్‌గా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

2023లో పవర్‌లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టిన ప్రగతి, అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించారు. తన ప్రయాణాన్ని హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకంతో ప్రారంభించి, ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఐదో స్థానంలో నిలిచినప్పటికీ, వెనుదిరగలేదు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి తన సత్తాను చాటారు. ఆ తర్వాత 2024లో సౌత్ ఇండియన్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు.

ఇక 2025 సంవత్సరం ప్రగతి కెరీర్‌లో అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెల్చుకున్న ఆమె, కేరళలో జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించారు. 

కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. నటనలో రాణిస్తూనే, క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొంది జాతీయ ఛాంపియన్‌గా నిలవడం ఆమె అంకితభావానికి నిదర్శనం. టర్కీలో ఈ పోటీల్లోనూ ప్రగతి విజయం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆమె అభిమానులు, క్రీడా ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.


More Telugu News