: ఈ సైకిల్‌పై ఎగరనూ వచ్చు...!
ఏంటీ... తమాషా అనుకుంటున్నారా... నిజమే చెబుతున్నాం. ఈ సైకిల్ ఎగురుతుందట. ఎగిరే విధంగా ఈ సైకిలును తయారు చేశారు శాస్త్రవేత్తలు. అందునా రిమోట్ కంట్రోల్ సాయంతో గాలిలోకి ఎగిరేలా ఈ సైకిలును రూపొందించారు శాస్త్రవేత్తలు. చెక్ రిపబ్లిక్కు చెందిన మూడు కంపెనీలు కలిసి ఈ గాలిలో ఎగిరే సైకిల్‌ను తయారు చేశాయి. రిమోట్ కంట్రోల్ సహాయంతో గాలిలో ఎగిరే ఈ ఫ్లైయింగ్ సైకిల్ నమూనాను చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్ నగరంలో జరిగిన ఒక ఎగ్జిబిషన్లో బుధవారం నాడు ఒక బొమ్మను సైకిలుపై ఉంచి ప్రయోగాత్మకంగా నడిపి ప్రదర్శించారు.
గాలిలో ఐదు నిమిషాల పాటు ఈ సైకిలు రయ్యిన ఎగిరి, తర్వాత సురక్షితంగా కిందికి దిగింది. మొత్తం 95 కేజీల బరువుగల ఈ సైకిలుకు ముందు భాగంలో రెండు, వెనుక భాగంలో రెండు, ఇరుపక్కల ఒక్కో బ్యాటరీని అమర్చారు. ప్రస్తుతానికి రిమోట్ కంట్రోల్‌తో మాత్రమే నడుస్తున్న ఈ సైకిలును మనం నడపాలంటే మరింత శక్తిమంతమైన బ్యాటరీలు కావాలంటున్నారు శాస్త్రవేత్తలు.