: ఆంధ్రలోనే శిశు మరణాలు ఎక్కువట!
ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే శిశు మరణాలు ఎక్కువట. ఒకవైపు ఈ మరణాలను తగ్గించాలని ప్రభుత్వం పౌష్టికాహారం అందించేందుకు ఎన్ని పథకాలు రూపొందించి అమలు పరచినా... ఒకవైపు శిశు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రతి ఆరు మరణాల్లో ఒకటి శిశుమరణమేనని యునిసెఫ్ లెక్కలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో పౌష్టికాహారం, పారిశుద్ధ్యంపై శాసనసభ్యులకు అవగాహన కల్పించేందుకు యునిసెఫ్, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అసెంబ్లీ లాబీల్లో ఒక ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాయి. సభాపతి నాదెండ్ల మనోహర్ చొరవతో ప్రత్యేకంగా మెదక్ జిల్లాని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలోని ఛాయాచిత్రాలు మన రాష్ట్రంలోనే శిశుమరణాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయట. పౌష్టికాహారం అందించే పథకాలు రూపొందించి, నిధులు పంపిణీ చేసినంతమాత్రాన సరిపోతుందా... పౌష్టికాహారం అందరికీ అందేలా సరైన చర్యలు తీసుకుంటే... శిశు మరణాలను కొంతైనా నివారించేందుకు వీలవుతుందేమో!