: ముందు గుళ్లో పూజ, తరువాత సుష్టుగా భోజనం చేసిన శ్రీశాంత్
జైలు నుంచి విడుదలైన శ్రీశాంత్ కొచ్చి చేరగానే ముందుగా గుడికెళ్లాడు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటికి చేరిన శ్రీశాంత్ కమ్మని అమ్మచేతి వంటను రుచి చూశాడు. మూడు వారాల పాటు సరైన భోజనానికి మొహం వాచిన శ్రీశాంత్ తనకిష్టమైన వంటకాలను ఆవురావురంటూ లాగించాడు. తల్లిదండ్రులిద్దరూ కొసరికొసరి వడ్డించడంతో తృప్తిగా తిన్నాడు. జైలులో ఉన్నంతకాలం తనకు ప్రత్యేకభోజనం కావాలని, మినరల్ వాటర్ కావాలని అధికారులను తెగవిసిగించాడని మొన్న పోలీసులు పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే శ్రీశాంత్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిపోయాడని ఓ పోలీసధికారి వ్యాఖ్యానించారు కూడా. కడుపునిండా తిన్న శ్రీశాంత్ మాట్లాడుతూ, పగవాడికి కూడా ఈ కష్టాలు రాకుడదని అన్నాడు. నిరాధార ఆరోపణలతో తనను అరెస్టు చేశారని, భారత న్యాయవ్యవస్ధపై తనకు నమ్మకం ఉందని, తాను సేఫ్ గా బయటపడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మళ్లీ మరోసారి జైలు మొహం చూడకూడదని కోరుకున్నాడు.