: ఆ కాలంలో టెలిగ్రాములుండేవట...!


అంతే... ఇకపై ఇలాగే చెప్పుకోవాలేమో... ఎందుకంటే త్వరలో టెలిగ్రామ్‌ సేవలను ఎత్తేస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన టెలిగ్రామ్‌ వ్యవస్థ అప్పట్లో ఎంతో వేగంగా సమాచారాన్ని చేరవేసే అత్యున్నత వ్యవస్థగా ఉండేది. తక్కువ ఖర్చుతో సామాన్యులకు అందుబాటులో ఉండేది. సదరు టెలిగ్రామ్‌ అనే వ్యవస్థపై ఎన్ని కథలు వచ్చాయో లెక్కలేదు. అయితే ఇప్పుడు టెలిగ్రామ్‌ సర్వీసులను ఉపయోగించే వారే అరుదుగా ఉన్నారు. ఎందుకంటే, ఎలాంటి కబురైనా ఇట్టే క్షణాల వ్యవధిలో మనవారికి చేరవేసేందుకు అందరికీ అందుబాటులో సెల్‌ఫోన్‌ ఉంటోందిగా...!

ప్రస్తుత కాలంలో మనవాళ్లందరి చేతుల్లోనూ వివిధ రకాల రింగుటోన్లతో మోగుతోంది సెల్‌. దీనిద్వారా ఎలాంటి సమాచారాన్నైనా... ఎవరితో మనం మాట్లాడాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాతకాలం నాటి టెలిగ్రామ్‌ వ్యవస్థను ఎవరు ఉపయోగించుకుంటారు...? అందుకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. జూలై 15నుండి టెలిగ్రామ్‌ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని ఢల్లీలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ షయీమ్‌ అఖ్తర్‌ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ వ్యవస్థకు సంబంధించి కార్యాలయాల్లో ఉపయోగిస్తున్న కంప్యూటర్లు తదితర పరికరాలను ఇతర విభాగాలకు సమకూర్చనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా బిఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌, ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ విభాగాలకు పంపిస్తామని ఉత్తర్వుల్లో తెలిపారు. మొత్తానికి ఒకప్పుడు వార్తా ప్రపంచంలో అత్యంత వేగంగా వార్తలు చేరవేసే టెలిగ్రామ్‌ వ్యవస్థ ఇకపై చరిత్రలో ఒక మలుపురాయిగా మారనుంది. చరిత్రపుటలకే పరిమితం కానుంది.

  • Loading...

More Telugu News