: భారత విమానాలు చొరబడ్డాయంటూ పాక్ గగ్గోలు
భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని పాకిస్థాన్ ఆరోపించింది. లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలోని పాక్ పటన్ జిల్లాలో ఐఏఎఫ్ విమానాలు ప్రవేశించి రెండునిమిషాల పాటు చక్కర్లు కొట్టాయని పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన భారత యుద్ధవిమానాలు పాక్ గగనతలంలోకి 3 నాటికన్ మైళ్ల మేర చొచ్చుకొచ్చాయని, ఫల్కాజీ సెక్టార్ లో ఈ ఘటన జరిగిందని, వాటినెదుర్కొనేందుకు పాక్ కు చెందిన రెండు విమానాలు సిద్దమవగానే అవి వెనుదిరిగాయని పాక్ వాయుసేన ప్రతినిధి తెలిపారు. ఈ వ్యవహారంలో పాక్ భారత్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేయలేదని, రోజువారీ వ్యాయామంలో భాగంగా సరిహద్దు సమీపం వరకూ భారత విమానాలు వెళ్లాయి కానీ, గగనతలంలో చొరబడలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.