: కోటీశ్వరులకు కేరాఫ్ ఖతార్!
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు ఎక్కడున్నారు? అంటే టక్కున ఖతార్ అని చెప్పేయొచ్చు. ఎందుకంటే అక్కడే కోటీశ్వరులు ఎక్కువమంది ఉన్నారట. ఈ విషయాన్ని ఉత్తినే చెప్పేయటం లేదు. ఒక సర్వే నిర్వహించి మరీ తేల్చిన సత్యం. ఖతార్లో సుమారు 14.3 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారని ఒక తాజా సర్వే చెబుతోంది. అక్కడ ప్రతి 1000 ఇళ్లకుగాను 143 మంది కోటీశ్వరులున్నారట.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్స్ (బీసీజీ) 13వ యాన్యువల్ గ్లోబల్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాన్ని గురించి పేర్కొంది. ఇలా కోటీశ్వరుల సంఖ్య స్థానానికి సంబంధించి 11.5 శాతం మంది కోటీశ్వరులతో కువైట్ మూడో స్థానంలోను, బహ్రెయిన్ ఏడోస్థానంలోను, యూఏఈ తొమ్మిదో స్థానంలోను ఉన్నాయట. అలాగే మధ్య ఆసియా ప్రాంతంలో 2012లో 9.1 శాతం ప్రైవేటు సంపద వృద్ధి చెందిందని ఈ నివేదిక పేర్కొంది. కాగా ఖతార్లో 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న ఇళ్ళు ప్రతి లక్షకూ ఎనిమిది ఉన్నాయని, ఈ విషయంలో ప్రపంచంలో ఖతార్ నాలుగో స్థానంలో ఉందని నివేదిక చెబుతోంది.