: గర్భిణిని మోసుకొని 40 కి.మీ నడచిన భర్త
ఇంటి పనుల్ని వాటాలేసుకొని చేసే దంపతులున్న రోజులివి. అటువంటిది తన భార్య ప్రాణం కాపాడడం కోసం ఓ యువకుడు చేసిన ప్రయత్నం వింటే ఎవరికైనా గుండె ఝల్లుమనాల్సిందే. కేరళలోని కొట్టాయమ్ పట్టణానికి సమీపంలోని 'కొన్నీ అడవి'లో భార్య సుధతో కలసి నివాసముంటున్నాడు అయ్యప్పన్ అనే గిరిజనుడు. ఏడో నెల గర్భవతైన సుధకు నొప్పులు రావడంతో వైద్యం కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొకాథోడ్ పట్ణణానికి తీసుకెళ్లడానికి ఉదయం ఆరు గంటలకు బయలుదేరాడు.
అయితే వీరు బయలుదేరిన కొద్దిసేపటికే కుండపోత వర్షం మొదలవడంతో నడవలేకపోయిన భార్యను తన భుజాలపై వేసుకుని, సరైన మార్గం కూడా లేని ఆ అటవీ ప్రాంతం నుంచి ఏకధాటిగా నడిచాడు అయ్యప్పన్. కొకాథోట్ చేరుకొని అక్కడి నుంచి ఓ జీపును తీసుకొని సాయంత్రం ఆరు గంటలకు పట్నంథిటా జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడి డాక్టర్లు కొట్టాయమ్ మెడికల్ ఆసుపత్రికి ఆ గర్భిణిని తరలించారు. అప్పటికే సుధ ఆరోగ్యం విషమించినా, డాక్టర్లు శ్రమించి ఆమె ప్రాణాన్ని నిలబెట్టగలిగారు. అయితే బిడ్డను మాత్రం బతికించలేకపోయారు. అంత జాగ్రత్తగా భర్త తీసుకొచ్చాడు కాబట్టే ఆమె ప్రాణాన్ని కాపాడగలిగామని వైద్యులు అయ్యప్పన్ పై ప్రశంసలు కురిపించారు.