: పట్టుబడిన సాంకేతిక చోరుడు
అంతర్జాల సాంకేతికతలో నిష్ణాతుడైన ఓ విద్యార్థి తన తెలివితేటలను అక్రమమార్గంలో ఉపయోగించుకుంటూ దొరికిపోయాడు. నొయిడాలోని సి.జి.మంత్ర యానిమేషన్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్న సచిన్ శర్మ అనే విద్యార్థి కంప్యూటర్ సాంకేతికతలో నేర్పరి. యానిమేషన్లో సచిన్ శర్మ ప్రతిభకు తోటి విద్యార్థులే అసూయపడుతుండేవారు. అలాంటి ఈ విద్యార్థి క్వికర్.కామ్ పోర్టల్ ను ఉపయోగించుకొని అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఓ మోటారు సైకిల్ ను దొంగలించి యానిమేషన్ తో దాని రూపురేఖలు మార్చివేసి క్వికర్.కామ్ లో పెట్టాడు. దానికి సంబంధించిన పత్రాలను కూడా ఇలాగే తయారు చేసుకున్నాడు. ఓ కస్టమర్ ఆ మోటారు సైకిల్ కొనడానికి ఆసక్తి చూపించాడు. ఆ వినియోగదారుడికి ఆ వాహనాన్ని అప్పగించే సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వల పన్ని సచిన్ తోపాటు ఈ విషయంలో ఆయనకు సహకరించిన అమిన్ ఖాన్ అనే మరో విద్యార్థిని అదుపులోకి తీసుకొని ఐదు కేసులు నమోదు చేశారు. ‘జైత్ పూర్ లోని ఆగ్రా కెనాల్ దగ్గరకు ఇద్దరు విద్యార్థులు దొంగలించిన బైకుపై వస్తున్నారని మాకు సమాచారం అందింది. వెంటనే స్పందించి వాళ్లిద్దర్నీ పట్టుకొని విచారించగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి’ అంటూ వివరించారు క్రైమ్ ఏసీపీ రవీంద్ర యాదవ్.