: కర్రపెండలం ఆకులే కీటక వినాశనులు!
కర్రపెండలం పంట గురించి తెలిసిన వారికి ఆ పంటను పురుగు ఆశించదనే విషయం తెలుసు. అయితే ఏ కారణంగా ఈ పంటను పురుగు ఆశించదు అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే ఈ ప్రత్యేక కారణాన్ని గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఈ పంట ఆకుల ద్వారానే పురుగు వినాశకాలను తయారు చేయవచ్చని కనుగొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఉండే పంటల పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే పురుగు మందులు వాడకుండా పంటలు పండించడం అనేది సాధ్యం కాకుండా ఉంది. ఈ నేపధ్యంలో కర్రపెండలం నుండి పురుగులను చంపే రసాయనాలు లేని మందును రూపొందించారు. కేరళలో అరటి తోటలపై ప్రయోగించినపుడు మంచి ఫలితాలు కూడా వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది.
కర్రపెండలం పంటను పురుగు ఆశించదు అనే అంశాన్ని తన ప్రయోగానికి ఎంచుకున్న డాక్టర్ సి.ఎ.జయప్రకాశ్ ఆ మొక్క ఆకుల్లో ఉన్న పురుగును చంపే శక్తిని గమనించారు. నిజానికి కర్రపెండలం ఆకుల్లో అనేక పోషక విలువలుంటాయి. అయినా కూడా వాటిలోని విషలక్షణం కారణంగా వాటిని ఆహారంగా తీసుకోరు. పశువుల మేతగా కూడా ఉపయోగించరు. ఈ ప్రత్యేక లక్షణాన్ని గమనించిన జయప్రకాశ్ కర్రపెండలం ఆకుల నుండి ప్రత్యేకమైన మందును తయారు చేశారు. ఈ మందును కేరళలోని సుమారు 30 వేల అరటి చెట్లపై ప్రయోగించి విజయాన్ని సాధించారు. ఈ మందు అరటి పంటలో కాండం తొలుచుపురుగు, కాయ తొలుచు పురుగులను నాశనం చేస్తుందని ఆయన చెబుతున్నారు.