: హ్యాకర్ల దాడికి గురైన ఫేస్ బుక్
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తాజాగా హ్యాకింగ్ కు గురైంది. గుర్తు తెలియని హ్యాకర్ల బృందం తమ వెబ్ సైట్ లోకి అక్రమంగా ప్రవేశించిందని ఫేస్ బుక్ యాజమాన్యం వెల్లడించింది. అయితే సమాచారం తస్కరించినట్టు ఆధారాలేవీ లభ్యం కాలేదని ఫేస్ బుక్ తెలిపింది. హ్యాకింగ్ కు పాల్పడ్డ వారి వివరాలు వెల్లడించేందుకు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నిరాకరించింది.
అయితే, హ్యాకర్లు చైనా నుంచి ఈ దాడులకు యత్నించి ఉంటారని మరో సంస్థకు చెందిన కంప్యూటర్ నిపుణుడు పేర్కొన్నారు. ఇదిలావుంటే, మరో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ కూడా ఈ నెల మొదట్లో హ్యకింగ్ కు గురైనట్టు వార్తలు వచ్చాయి. ఖాతాదారుల కీలక వివరాలను హ్యాకర్లు సేకరించారని సమాచారం.