: సోనియమ్మను కలిసిన మంద కృష్ణ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సోనియాను కోరినట్టు మంద కృష్ణ తెలిపారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు దూరమవుతారని సోనియాకు వివరించినట్టు తెలిపారు. తమది న్యాయబద్ధమైన డిమాండ్ అని.. రాజకీయ, సాంకేతికపరమైన ఇబ్బందులు ఉండబోవని ఆయన మీడియాతో పేర్కొన్నారు. కాగా, సోనియాను కలిసిన సమయంలో మంద కృష్ణ వెంట కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా ఉన్నారు.