: బూతు లేకుండా హిట్ కొట్టాలనుకున్నా: మారుతి
'ఈరోజుల్లో..', 'బస్ స్టాప్' సినిమాలకు భిన్నంగా ద్వందార్థాలు లేకుండా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నానని, ఆ ప్రయత్నంలో భాగంగా తెరకెక్కించిందే.. 'ప్రేమకథాచిత్రమ్' సినిమా అని దర్శకుడు మారుతి అంటున్నారు. మారుతి ఈ చిత్రానికి కథా సహకారం అందించారు. 'ఈరోజుల్లో..' 'బస్ స్టాప్' చిత్రాలకు కెమెరామెన్ గా వ్యవహరించిన ప్రభాకరరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తారు. యూత్ ను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరోహీరోయిన్లు సుధీర్ బాబు, నందితలతో పాటు మారుతి కూడా టీవీ9 స్టూడియోలో సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ, బూతు లేకుండా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఈ సినిమాలో కామెడీకి మంచి స్పందన వస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. 'వెన్నెలైనా, చీకటైనా'.. అంటూ సాగే కృష్ణ గారి పాటను చెడగొట్టకుండా కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నామని చెప్పాడు. ఈ గీతంలో సుధీర్, నందిత కళ్ళు తిప్పుకోలేనంత పెర్ఫార్మెన్స్ కనబర్చారని అన్నాడు. ప్రభాకరరెడ్డి దర్శకత్వ రంగానికి కొత్త అయినా, సినిమాను చక్కగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. అయితే, పాటలను తానే తెరకెక్కించానని మారుతి తెలిపాడు.
ఇక సినిమా మొదట ఆట తర్వాత అల్లు అరవింద్ ఫోన్ చేసి అభినందించడం సంతోషం కలిగించిందన్నాడు. నాని, అల్లరి నరేశ్ కూడా అభినందనలు తెలిపారని ఈ యువ దర్శకరచయిత మురిసిపోయాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరి చిత్రం హిట్టయినా అందరూ ఆ ఆనందాన్ని పంచుకుంటారని చెబుతూ, ఈ ఆరోగ్యకరవాతావరణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు.