: మిస్బా ఒంటరిపోరు ...పాక్ 170 అలౌట్
పాకిస్ధాన్ ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన మిస్బా 96 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మిస్బా నాసిర్ జంషెడ్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కేవలం 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఒక ఎండ్ లో టెయిలెండర్లను నిలిపి విండీస్ బౌలర్లను ఒంటి చేత్తో అడ్డుకున్నాడు. జంషెడ్ ఔటైన తరువాత వచ్చిన బ్యాట్స్ మన్ ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు చెయ్యకపోవడం విశేషం. విండీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ విలవిల్లాడిపోయింది. పాకిస్థాన్ జట్టులో 9మంది సభ్యులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారంటే వెస్టిండీస్ బౌలర్ల బంతుల్లో వేడి వాడి అర్ధం చేసుకోవచ్చు.
వికెట్లు వడివడిగా పడిపోవడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. దీంతో 48 ఓవర్లలో 170 పరుగులకు పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. రోచ్, నరైన్ మూడేసి వికెట్లతో పాక్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించగా అతనికి రాంపాల్, బ్రావో లు చక్కని సహకారమందించారు. వీరి బౌలింగ్ కు తోడు చురుకైన విండీస్ ఫీల్డింగ్ పాక్ ను కష్టాల్లోకి నెట్టింది.