: 'హోం' శాఖపై కన్నేసిన డిప్యూటీ సీఎం!
మైనింగ్ కేటాయింపులు మెడకు చుట్టుకుని సబితా ఇంద్రారెడ్డి పదవికి రాజీనామా చేయడంతో.. రాష్ట్ర హోం శాఖ మంత్రి పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా కుర్చీపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కన్నేశారు. 'ఆలసించిన ఆశాభంగం' అన్న విషయం తెలిసిన రాజనర్సింహ ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం ఢిల్లీ వెళ్ళిన ఉప ముఖ్యమంత్రివర్యులు కోర్ కమిటీ సభ్యుడు, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కలిసి తన మనసులో మాట చెప్పారు. ఆ తర్వాత రోజున అధినేత్రి సోనియాతో తనకు హోం శాఖ కేటాయించాలని విన్నవించుకున్నట్టు సమాచారం.
పైగా, ఈ రెండ్రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ తో రెండుసార్లు సమావేశమై తన హస్తిన రాక వెనుక ఉన్న అంతర్యాన్ని వివరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారికి హోం శాఖ ఇవ్వడం ఆనవాయతీ అని, పైగా, తాను తెలంగాణకు చెందిన వ్యక్తినని.. సీఎం, పీసీసీ చీఫ్ ఆంధ్రా ప్రాంతానికి చెందినవారని ఢిల్లీ పెద్దలకు రాజనర్సింహ విపులీకరించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమాన్ని తానైతే సమర్థంగా ఎదుర్కోగలనని ఆయన వారికి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది.