: పాక్ లో తప్పిపోయి రాజస్థాన్ లో ఫొటోగా తేలిన బాలిక!
ఒక హిందూ బాలిక రెండేళ్ల కిందట పాకిస్థాన్ లో తప్పిపోయింది. కానీ, ఆ బాలిక ఫొటో మాత్రం మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖంగా కనిపిస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వం 'ఆడపిల్లను కాపాడండి' అనే పథకం ప్రచార పత్రాలు, హోర్డింగులలో అధికారులు ఆ బాలిక ఫొటోను వాడేస్తున్నారు. ఆ బాలిక స్థానికురాలు కాదని తాజాగా ఒక పత్రిక ప్రచురిస్తే గానీ అధికారులు తమ తప్పిదాన్ని తెలుసుకోలేకపోయారు. విషయమేమిటంటే, పథకం కోసం బాలిక ఫొటోను అధికారులు నేరుగా సేకరించకుండా ఆన్ లైన్ లో దొరికినది తీసుకుని వాడేశారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇకపై ఏ ప్రభుత్వ శాఖ అయినా నేరుగా తమ ఫొటోగ్రాఫర్ల ద్వారా సేకరించిన ఫొటోలనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో?