: వద్దన్న దానిపైనే మరింత మక్కువట!
మనం చిన్న పిల్లలకు ఏదైతే వద్దంటామో అదే కావాలని మారాం చేస్తారు... ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ పనినైతే చేయకూడదని చెబుతారో ఆ పనిపైనే మనకు మక్కువ ఎక్కువవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన మెదడు మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోబాటు నిషిద్ధ వస్తువులపై కూడా సమానస్థాయిలో దృష్టి సారించడం వల్ల మాత్రమే జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిషిద్ధ ఆనందాల పట్ల ప్రజలు ఎందుకు మక్కువ చూపుతారు? అనే విషయంపై ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పైవిషయం వెల్లడైంది.
ప్రజలను దేనికైతే దూరంగా ఉండాలంటామో వారికి దానిపైనే మరింత ఆసక్తి పెరుగుతుందని పరిశోధకులు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే వారి మెదడు నిషిద్ధ వస్తువులపైన కూడా తదేక దృష్టిని నిలుపుతుండడమే దీనికి కారణమని వారు గుర్తించారు. వద్దన్న వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనే కోరికను వారు నిలువరించుకోలేని స్ధితికి ఇది కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమంటే మనం ఏ వస్తువులను వారికి వద్దన్నామో, ఆ వస్తువులను అందరికీ కూడా నిషేధిస్తే వాటిపై వారు అంతగా ఆసక్తి చూపడం లేదని ఈ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనను అనుసరించి ఆహార నియమాలకు సంబంధించిన పద్ధతులను బృందాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తే మరింతగా విజయవంతం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పిల్లల్లో ఆటబొమ్మలు, ఇతర నిషేధిత వస్తువులపై ఉండే వ్యామోహాన్ని తగ్గించే విషయంలో కూడా ఈ పరిశోధనా ఫలితాలు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.