: చిరంజీవి, కిరణ్ లు ఇప్పుడు శత్రువులా?


ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో గొప్ప సఖ్యత కనబర్చిన చిరంజీవి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య అంతరం నానాటికీ పెరిగిపోతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి తనవంతు సహకారం అందించిన చిరు, ఆనక కేంద్ర మంత్రి పదవి దక్కించుకుని రాజకీయంగా ఎదిగాననని నిరూపించుకున్నారు. మరోవైపు కిరణ్.. క్యాబినెట్లో అసమ్మతితో ఉక్కిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో డీఎల్ రవీంద్రా రెడ్డిపై వేటు వేయడం ద్వారా మిగతా వారికి హెచ్చరికలు పంపిపట్టు నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

అధిష్ఠానం అండదండలు పుష్కలంగా ఉండడంతో కిరణ్ మరింత కఠిన వైఖరి అవలంభించేలా చేస్తోంది. మరికొద్ది రోజుల్లో మరో ఇద్దరు మంత్రులపైనా వేటు తప్పదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. వారిలో ఒకరు చిరంజీవికి నమ్మినబంటుగా పేరుగాంచిన దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య ఒకరన్న విషయం తెలిసిందే. చిరంజీవిని సీఎంగా చూడాలని ఉందంటూ ఈయన బహిరంగంగానే వ్యాఖ్యానించడం కిరణ్ కు కోపం తెప్పించింది. ఆ ఆగ్రహాన్ని కార్యాచరణలో పెట్టే క్రమంలో కిరణ్ ఢిల్లీలో మంతనాలకు తెరదీయగా.. అస్మదీయుడి కోసం చిరంజీవి సైతం హస్తినలో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. బుధవారం కిరణ్.. ఆజాద్ తో సుదీర్ఘంగా భేటీ అవగా.. తానేం తక్కువ తినలేదన్నట్టు చిరంజీవి ఏకంగా అధినేత్రి సోనియాతో సమావేశమయ్యారు.

పైకి రాష్ట్ర వ్యవహారాలపైనే తాము హైకమాండ్ ను కలిశామని వీరు చెప్పుకున్నా.. రామచంద్రయ్య విషయమే వీరి మధ్య ప్రధాన చర్చనీయాంశమని తెలుస్తోంది. చిరు సన్నిహితుడిని క్యాబినెట్ నుంచి తొలగించాల్సిందేనని కిరణ్.. ఆజాద్ తో పేర్కొనగా.. తన ముఖ్య అనుచరుడు రామచంద్రయ్యపై ఎట్టిపరిస్థితుల్లోనూ చర్య తీసుకోవడానికి వీల్లేదని చిరంజీవి.. సోనియాను కోరినట్టు సమాచారం. కాగా, చిరంజీవి, కిరణ్ ల మధ్య ఇప్పటివరకు ప్రత్యక్ష విరోధం ఏమీ లేనప్పటికీ, వారిద్దరూ పెద్దగా కలివిడిగా ఉన్నదీ ఏమీలేదు.

పనిలోపనిగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. ఈయన డీఎల్ కు మద్దతివ్వడానికే హస్తిన చేరినట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో కిరణ్ కు ఈ రకంగానూ సెగ తగలనుంది. కిరణ్ కు- రాజనర్సింహకు చాలాకాలం నుంచి పొసగడంలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News