: ఛాంపియన్స్ టీమిండియాకు దక్కుతుందా?
మరి కాసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. టెస్టుల్లో మేటి జట్టు సౌత్ ఆఫ్రికాతో వండే ఛాంపియన్ టీమిండియా తలపడనుంది. తొలి పోరుకు రెండు జట్లూ రె'ఢీ' అంటున్నాయి. గ్రూప్ బీ ఇంగ్లాండ్ కార్డిఫ్ లో జరుగనున్న ఈ పోరులో పైచేయి సాధించేందుకు రెండు జట్లు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. అయితే కొత్త నిబంధనలు, పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్, కఠినమైన ప్రత్యర్ధి... ఈ నేపథ్యంలో భారత్ ఆశలు నెరవేరుతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. గ్రూప్ బీలో నాలుగు జట్లూ దేనికవే సాటి. అన్నీ ఫేవరేట్లే. ఒక్క క్షణం చాలు మ్యాచ్ ఫలితం మారిపోవండానికి!
ఈ గ్రూప్ లో కాస్త నిలకడ లేని పాక్ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. కానీ పాక్ ఎప్పడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు(వారికే తెలీదు). అద్భుతమైన పేస్ బౌలింగ్, తిరుగులేని బ్యాటింగ్ పాక్ ప్రధాన ఆయుధాలు. అంచనాలకు అందని ప్రదర్శన వీరి సొంతం కాగా, అజ్మల్ వీరి ప్రధాన బలం. సౌతాఫ్రికా టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ జట్టు. స్టెయిన్ లాంటి అత్యుత్తమ బౌలర్ తో పాటూ ఆమ్లా, డివిలీర్స్ లాంటి మ్యాచ్ విన్నర్లు వారి సొంతం. దీంతో సఫారీలు టైటిల్ ఫేవరేట్ గా కనిపిస్తున్నారు. ఇక విండీస్ నిండా మ్యాచ్ విన్నర్లే. ఎక్కువ మంది ఆల్ రౌండర్లతో విండీస్ టీం ట్రోఫీని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోసారి టీ ట్వంటీ మ్యాజిక్ చూపించాలనుకుంటోంది.
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదనే నినాదంతో బ్లూబాయ్స్ రంగంలోకి దిగుతున్నారు. టీమిండియా యువకులతో మంచి ఫాంలో ఉంది. అదీ కాక ప్రంపంచ ట్రోఫీలన్నీ ఖాతాలో జమ చేసుకున్న భారత జట్టుకు ఇదోక్కటే అందని ద్రాక్ష అందుకే చివరిసారి గెలవాలని పట్టుదలగా ఉంది. మరి, ఈ గ్రూప్ నుంచి ఎవరు ముందుకు వెళతారు అనేదే అభిమానులను పీడిస్తున్న ప్రశ్న.