: ఇక పది నిమిషాల్లో పిజ్జా డెలివరీ!
మీకు పిజ్జా కావాలంటే ఏ పిజ్జా షాపుకో ఆర్డరు వేసిన ఓ అరగంట లేదా గంట సమయానికి పిజ్జా డెలివరీ బాయ్ మీరు కోరిన పిజ్జాను తెచ్చిస్తాడు. అయితే ఇకనుండి మీరు కోరిన పిజ్జాను కేవలం పది నిమిషాల్లో మీ ముందు ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికాలోని డోమినోస్ పిజ్జా సంస్థ. ఇందుకోసం ఆ సంస్థ డ్రోన్లతో పిజ్జాలను డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
అమెరికాలోని ఈ సంస్థ ప్రస్తుతం టి బిస్కట్స్ అనే సంస్థ సహాయంతో పిజ్జాలను డెలివరీ చేసే డ్రోన్లను రూపొందించే పనిలో ఉంది. వీటికి డోమికాప్టర్ అనే పేరుకూడా పెట్టింది. ఒక డోమి కాప్టర్‌ను ప్రయోగించగా అది రెండు పిజ్జాలను ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉండే వారికి పది నిముషాల్లో అందజేసింది. ఈ డ్రోన్‌ను కిందినుండి ఒకరు ఆపరేట్ చేస్తారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల భవిష్యత్తులో జీపీఎస్ సాయంతో పనిచేసే డ్రోన్లు కూడా రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.