: సీఎంపై కేసు వేస్తానంటున్న మాజీమంత్రి
మాజీమంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఎప్పుడూ ఏదో రూపంలో వార్తల్లో ఉండాలని తహతహలాడుతుంటారు. సొంతపార్టీ, బయట పార్టీ అన్న తేడా లేకుండా ఎవరినైనా సరే ఉతికి ఆరేసేస్తుంటారు. మీడియా సమావేశాలు పెట్టి ఆయా వ్యక్తుల మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. తాజాగా శంకర్రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ఎర్రచందనం స్కాం వ్యవహారంలో సంబంధం ఉన్న సీఎం తక్షణమే పదవినుంచి దిగిపోవాలని డిమాండు చేశారు. లేకుంటే 10వ తేదీలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానంటూ ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు శంకర్రావు. ముఖ్యమంత్రిని గనుక మార్చకుంటే రాష్టంలో పార్టీకి పుట్టగతులుండవని పేర్కొన్నారు. ఆరోపణలు, విమర్శలెదుర్కొంటున్న మంత్రులను కూడా పదవ తేదీలోగా తప్పించాలని ఆయన డిమాండు చేస్తున్నారు.