Revanth Reddy: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసనలు వద్దన్న కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

  • చంద్రబాబుకు మద్దతు తెలిపే వాళ్ల ఓట్లు కావాలి కానీ వారి నిరసనకు అనుమతివ్వరా? అని ప్రశ్న
  • నిరసన తెలియజేసేవాళ్లను అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారన్న రేవంత్ రెడ్డి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయవచ్చు కానీ టెక్కీలు ఇక్కడ చేయవద్దా? అని ప్రశ్న
Revanth Reddy counter to ktr on chandrababu arrest and protest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లేదా తెలంగాణలో నిరసనలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఏపీలో చూసుకోవాలని, కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇలాంటివాటిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్‌కు చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపే వాళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తారా? అని మండిపడ్డారు.

నిరసన తెలియజేసేవాళ్లని అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారని హెచ్చరించారు. అవసరమైతే వినతిపత్రం తీసుకొని అనుమతి ఇవ్వాలి అంతేకానీ, తిరస్కరించడం సరికాదన్నారు. ఎన్నికల్లో సెటిలర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. వారితో పన్నులు కట్టించుకొని, ఓట్లు వేయించుకొని ఆ అంశం మా రాష్ట్ర సమస్య కాదంటే ప్రజలు మూతి పండ్లు రాలగొడతారన్నారు. ఐటీ రంగం వాళ్లు ప్రొటెస్ట్ చేస్తామంటే ఒప్పుకోకపోవడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా? అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ అంశంపై నిరసన తెలపవచ్చు కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్లు నిరసన తెలియచేస్తే అడ్డుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు జాతీయస్థాయి నేత అన్నారు. చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాళ్లను వేళ్లపై లెక్కబెట్టవచ్చునన్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, అలాంటప్పుడు ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన తెలియజేయవద్దంటే ఎలా? అన్నారు. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముందన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో కూడా నిరసనలు జరిగాయన్నారు.

More Telugu News