: భారత్ తో మ్యాచ్ కు డేల్ స్టెయిన్ డౌటే!
భీకరమైన పేస్ కు అమోఘమైన స్వింగ్ నైపుణ్యం తోడైతే అది డేల్ స్టెయిన్ అవుతాడు. అందుకే, అగ్రశ్రేణి జట్లు సైతం స్టెయిన్ ను ఎదుర్కోవడాన్ని అంతగా ఇష్టపడవు. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ స్టెయిన్ బరిలో ఉన్నాడంటే ఎంత బలమైన బ్యాటింగ్ లైనప్ కైనా వణుకు తప్పదు. వికెట్ టు వికెట్ బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టడంతో ఈ సఫారీ వీరుడు దిట్ట. అయితే, ఈ దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కు గాయమైంది. దీంతో, రేపు మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో అతనాడేది అనుమానంగా కనిపిస్తోంది.
స్టెయిన్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ తో వామప్ మ్యాచ్ లో అసౌకర్యంగా కదిలిన ఈ ఏస్ ఫాస్ట్ బౌలర్ ఐదు ఓవర్లు విసిరిన పిదప మైదానాన్ని వీడాడు. కాగా, ఇంగ్లండ్ లో జరగనున్న ఈ మినీ వరల్డ్ కప్ లో కార్డిఫ్ వేదికగా గురువారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇదే గ్రూప్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు కూడా ఉన్నాయి.