: సీబీఐ లక్ష్మీనారాయణ ఉంటారా? వెళతారా?
డిప్యుటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు కొద్ది కాలం క్రిందట బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన డిప్యుటేషన్ ఈ నెల 10 తో ముగియనుంది. ఈ దశలో ఆయన ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ ఉంటారా? లేక వెళ్తారా? అంటూ సరికొత్త చర్చ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిగా లక్ష్మీనారాయణ 2006 లో సీబీఐ డీఐజీ హోదాలో పదవీ బాధ్యతలు చేపట్టారు. గడచిన ఏడేళ్ల కాలంలో కీలకమైన ఫోక్స్ వ్యాగన్, ఔటర్ రింగురోడ్డు, రైల్వే ఉద్యోగాల కుంభకోణం, రాజశేఖరరెడ్డి మృతి, అన్నింటి కంటే దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తు చేపట్టారు. అవన్నీ విచారణలో కీలక దశకు చేరుకున్నాయి. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
ఈ దశలో ఆయన పదవీకాలం ముగిసిపోయింది. దీంతో మరో రెండేళ్లు పొడిగించింది ప్రభుత్వం. ఇదికూడా ముగిసిపోవడంతో ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందాయి. కానీ ఇప్పటివరకూ ఆయన ఇక్కడే ఉండాలా? లేక ఎప్పుడు వెళ్ళాలి? అన్న వివరాలతో ఎలాంటి ఉత్తర్వులు అందలేదని సమాచారం. దీంతో ఆయన ఉంటారా వెళతారా అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. తప్పని సరైతే మరో ఏడాది ఆయనను కొనసాగించే అవకాశముందని నిపుణులంటున్నారు. లేదంటే 10 తరువాత ఆయన హైదరాబాద్ ను వీడాల్సి ఉంటుంది.