: అధికారాన్నయినా వదులుకుంటాం, అవినీతిని మాత్రం సహించం: రాజ్ నాథ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ యూపీఏ అవినీతిపై ధ్వజమెత్తారు. కోల్ గేట్, ఖేల్ గేట్, రైల్ గేట్ ఇలా అన్నింటా యూపీఏ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నిజాం కళాశాలలో జరిగిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. అధికారాన్నయినా వదులుకుంటాం కానీ, అవినీతిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కర్ణాటకలో అక్రమాలకు పాల్పడ్డ యడ్యూరప్పను తొలగించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీజేపీ అవినీతికి వ్యతిరేకమని చెబుతూ, తమ ఒత్తిడితోనే అవినీతికి పాల్పడ్డ కేంద్రమంత్రులు రాజీనామా చేశారని రాజ్ నాథ్ చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రధానిపై అవినీతి ఆరోపణలు వచ్చింది ఈ దేశంలోనే అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇక తెలంగాణ అంశంపై మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందని నొక్కి చెప్పారు. 2004లోనే తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని రాజ్ నాథ్ ఉద్ఘాటించారు.