: 'సచినే స్ఫూర్తి' అంటోన్న సాఫ్ట్ వేర్ దిగ్గజం
ఫ్రెంచి వైన్.. ఎన్నేళ్ళు నిల్వ చేస్తే అంత రుచి. ఏళ్ళు గడిచేకొద్దీ ఆ రుచి పెరుగుతుందే తప్ప తరగదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా అంతే.. వయసు మీదపడుతున్నా వన్నె తరగని ప్రతిభతో కుర్రకారుకు దీటుగా క్రికెట్ కిక్కెక్కిస్తున్న దిగ్గజ బ్యాట్స్ మన్. అతడు వెన్నంటి ఉంటే చాలు, ఉత్తేజం పొంగిపొరలుతుంది, ప్రేరణ పరవళ్ళెత్తుతుంది. ముంబయి ఇండియన్స్ జట్టు తాజాగా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడం వెనకున్న ఛోదక శక్తి ఇదే. అటువంటి, తోటి క్రికెటర్లు సచిన్ ను ఆదర్శంగా తీసుకోవడంలో ఆశ్చర్యమేముంది? కానీ, భారత సాఫ్ట్ వేర్ రంగంలో ఇన్ఫోసిస్ సంస్థను అగ్రశ్రేణిలో నిలిపిన నారాయణ మూర్తికి సచినే స్ఫూర్తి ప్రదాత అంటే కించిత్ విస్మయం కలగకమానదు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడిగా చిరపరిచితుడైన బెంగళూరు వాసి నారాయణమూర్తి.. టీసీఎస్, హెచ్ సీఎల్ లకు దీటుగా సంస్థను పురోగతి పథంలో నడిపించడంతో పాటు పలువురికి మార్గదర్శిగా నిలిచారు. 2011లో సారథ్య బాధ్యతలనుంచి వైదొలిగిన ఈ మృదు స్వభావి.. మరలా కంపెనీ వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్నారు. కొద్దికాలం వరకు లాభాల బాటలో పయనించిన ఇన్ఫోసిస్ ఇటీవలి కాలంలో నష్టాలకు ఎదురీదుతోంది. దీంతో, కంపెనీ వర్గాలు నారాయణమూర్తికి మరోమారు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాయి. ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో నారాయణమూర్తి తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తూ, సచిన్ ను పోటీగా భావించి ముందుకెళతానని తన దృక్ఫథాన్ని చాటారు. 35 ఏళ్ళకే తోటి క్రికెటర్లు ఆట చాలిస్తుండగా, సచిన్ మాత్రం క్రికెట్ కు అనుగుణంగా తనను తాను మలుచుకున్న తీరు అమోఘమని కొనియాడారు. ఇక, ఇన్ఫోసిస్ ఓ జట్టనుకుంటే, తాను అందులో ఆటగాడినేనని నారాయణమూర్తి వినమ్రంగా చెప్పారు.