: వెనిగర్‌తో ఈ క్యాన్సర్‌ను గుర్తించొచ్చు!
మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను వెనిగర్ పరీక్షతో గుర్తించవచ్చని మనదేశంలో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. మహిళల్లో వచ్చే ఈ క్యాన్సర్ వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. కాగా, 'పాప్‌స్మియర్' పరీక్ష ద్వారా ఇప్పటికే ఈ క్యాన్సర్‌ను గుర్తించి చాలా మటుకు మరణాలను నివారించగలిగారు. అయితే ఈ కొత్త రకం వెనిగర్ పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించి దానిని అదుపులో పెట్టి మరింత మందిని మనం కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పరీక్ష గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వరం లాంటిదని వైద్యులు చెబుతున్నారు.
భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు ఆరోగ్య కార్యకర్తలున్నారు. వీరు వెనిగర్‌లో ముంచిన దూదితో మహిళ గర్భాశయ ముఖద్వారాన్ని తుడుస్తారు. అప్పుడు వెనిగర్ రంగు గనుక తెల్లగా మారితే వారిలో క్యాన్సర్ కారకాలున్నట్లు గుర్తించవచ్చని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు సురేంద్ర శ్రీనివాస శాస్త్రి తెలిపారు. ఒక వైద్య సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ పరీక్ష నూటికి నూరు పాళ్లు కచ్చితమైనదని చెప్పలేకపోయినప్పటికీ, ఈ పరీక్ష ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 31 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాలను నివారించగలుగుతున్నట్టు ఆయన తెలిపారు.