: పురాతన కాలం నుండీ అక్కడ మంచు ఉంది!
అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి ఉండేది. అయితే ఈ మంచు ఎప్పుడు ఏర్పడి ఉంటుందోనని శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేశారు. చివరికి అతి పురాతన కాలం నుండి అంటార్కిటికా ఖండం మంచుతోనే కప్పబడి ఉందని తేల్చిచెప్పారు.
స్పానిష్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్, గ్రెనెడా యూనివర్సిటీల సంయుక్త అధ్యయనబృందం ఈ ఖండంపై పరిశోధనలు సాగించింది. మంచు పొరల్లో డ్రిల్లింగ్ చేసిన పరిశోధకులు అక్కడి అంతర్భాగంలోని అవశేషాలను, సూక్ష్మజీవులను పరిశీలించి, వాటిని గురించి విశ్లేషించారు. ఈ సమాచారం ఆధారంగా ఆ ఖండం ఉపరితలంపైన, అంతర్భాగంలోను ఉన్న మంచు పొరల్లో జరుగుతున్న మార్పులను గురించి కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఈ ఖండంలో సుమారు 3.36 కోట్ల సంవత్సరాల క్రితం నుండే మంచు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మంచు అనేది ఏర్పడకముందు భూమి వేడిగా ఉండేదని, తర్వాత వాతావరణం మారిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.