: తినగ తినగ తేళ్ళు తీయనవును!
తినగ తినగ వేము తియ్యనుండు అని వేమన ఏమని చెప్పాడోగానీ తినగ తినగ తేళ్ళు, పాములు కూడా బాగానే ఉంటాయని ఇరాక్‌కు చెందిన ఒక రైతు అంటున్నాడు. అంతేకాదు... ఓ మూడు రోజుల పాటు వాటిని గనుక తినకుంటే తనకు అదోమాదిరి ఉంటుందని కూడా చెబుతున్నారు.
ఇరాక్‌కు చెందిన ఇస్మాయిల్ జాసిమ్ మహమ్మద్ అనే రైతు పొలాల్లో పనిచేసే సమయంలో పలుమార్లు తేళ్లు, పాముల బారిన పడ్డాడు. చివరికి వాటితో విసుగెత్తిన ఇస్మాయిల్ వాటిపై తన కసి తీర్చుకునేందుకు వాటిని పట్టుకుని ప్రాణాలతో ఉండగానే కరకరా నమిలి తినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయనగారి ప్రధాన ఆహారం కూడా తేళ్ళు, పాములేనట. అయితే ఈ జంతువులు విషపూరితమైనవి కదా... తినేటప్పుడు తమరికి ఏమీ కాదా...? అని ప్రశ్నిస్తే... పలుమార్లు తినే సమయంలో నోటిలోనే తనను కుట్టాయని... అయితే ఇలా అనేకసార్లు కుట్టడం వల్ల సదరు విషానికి విరుగుడు కూడా తన నోట్లోను, శరీరంలోను అభివృద్ధి చెందిందని, కాబట్టే తనకు ఏమీ కావడం లేదని ఇస్మాయిల్ చెబుతున్నాడు.