: వంటింట్లోనే మధుమేహాన్ని అదుపు చేయవచ్చు!


ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని బాధించేది మధుమేహ వ్యాధి. ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవు. అయితే మన ఇంట్లోని పోపు దినుసుల్లోనే మధుమేహాన్ని అదుపు చేసేందుకు మందుందట. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు 15 సంవత్సరాల నిరంతర పరిశోధన చేసిన తర్వాత మన ఇంట్లోని పసుపు, అల్లం, ఉసిరి, దాల్చిన చెక్క, మిరియాలతో మధుమేహాన్ని అదుపు చేయవచ్చని చెబుతున్నారు.

మధుమేహం ఒకసారి వచ్చిందంటే మన శరీరంలోని అన్ని అవయవాలను క్రమేపీ ఆక్రమించుకుంటుంది. అయితే ఇలా ఈ వ్యాధి శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించకుండా ఉండేందుకు మధుమేహ రోగులు తమ ఆహారంలో పసుపు, అల్లం, ఉసిరి, దాల్చిన చెక్క, మిరియాలను అధికంగా తీసుకోవాలని ఎన్‌ఐఎన్‌ లోని ఆక్యులర్‌ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్‌ భానుప్రకాష్‌ రెడ్డి చెబుతున్నారు. ఈయన నేతృత్వం వహించిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయంపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు సాగిస్తోంది. ఈ ఐదింటిలోను ఒక్కోదానిలో సుమారు 20 నుండి 30 వరకు ప్రత్యేకమైన అణువులు (మాలిక్యూల్స్‌) ఉన్నాయని, ఇతర అవయవాలపై మధుమేహం ప్రభావం చూపకుండా ఇవి అడ్డుకుంటాయనే విషయాన్ని వీరు జంతువులపై పరిశోధించి గుర్తించారు. అయితే వీటిని ఎంత మోతాదులో ఇవ్వాలనే విషయంపై ఇంకా పరిశోధన సాగిస్తున్నారు. ఈ ఐదు దినుసులు కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవి కావు. కాబట్టి ఆహారంలో ప్రస్తుతం తీసుకునే మోతాదుకన్నా మరికాస్త ఎక్కువ శాతం వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి వ్యాధి అదుపులోకి రావడానికి వీలవుతుందని ఆయన చెబుతున్నారు. వీటిపై పరిశోధన చేసి ఈ ప్రత్యేకమైన మాలిక్యూల్స్‌తో ఒక ఔషధాన్ని రూపొందించే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మరో మూడేళ్లలో ఈ మందు రూపుదిద్దుకునే అవకాశం ఉందట.

  • Loading...

More Telugu News