: జగన్ జైలు జీవితానికి నేటితో ఏడాది
కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డిని అక్రమాస్తుల కేసులో సిబిఐ 2012 మే 27న అరెస్ట్ చేసింది. నేటికి సరిగ్గా జగన్ ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అధికార దుర్వినియోగంతో వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ తర్వాత విచారణ చేపట్టిన సిబిఐ జగన్ అవినీతికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయంటూ ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఇప్పటి వరకూ ఐదు చార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ ఏడాది కాలంలో జగన్ బెయిల్ పై బయటకు రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా సిబిఐ విజయవంతంగా అడ్డుకోగలిగింది.
ఇక, జగన్ జైలుకెళ్లి ఏడాది పూర్తి అయినందున వైఎస్సార్ కాంగ్రెస్ సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ర్యాలీకి పార్టీ నేతలు సమాయత్తం అయ్యారు.