: ధర్మాన, సబిత రాజీనామా కథ సమాప్తం.. గవర్నర్ ఆమోదం
కళంకిత మంత్రులుగా పేరుబడ్డ ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో వీరి రాజీనామా కథ ముగిసిపోయింది. 9 ఏళ్లుగా మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సబిత ఇక మాజీయే. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరినీ నిందితులుగా సిబిఐ చార్జిషీట్లలో పేర్కొంది. వాన్ పిక్ కు అడ్డగోలు భూములు కేటాయించడంలో ధర్మాన, దాల్మియ సిమెంట్స్ కు గనుల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా ఆయా కంపెనీలకు లబ్ది చేకూర్చి.. వారి ద్వారా జగన్ కంపెనీలలో పెట్టుబడులకు వీరు సహకరించారని సీబీఐ అభియోగాలు మోపింది.
దీంతో వీరిపై ఇంటా బయట విమర్శలు అధికం అయ్యాయి. కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమంత్రి అశ్వని కుమార్, రైల్వే మంత్రి బన్సల్ ను పదవుల నుంచి ఇటీవలే తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలోనూ పరిణామాలు మారిపోయాయి. వీరిద్దరిని కూడా తప్పించాలంటూ ఒత్తిడి అధికం అయింది. దీంతో అధిష్ఠానం వీరిని తొలగించాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు సూచించింది. అనంతరం ముఖ్యమంత్రి సూచనల మేరకు వీరు రాజీనామాలు సమర్పించారు. వాటిని ముఖ్యమంత్రి గవర్నర్ కు పంపగా ఆయన తాజాగా ఆమోదించారు.