: ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత ఐపీఎల్ కి కూడా గుడ్ బై: ద్రవిడ్
స్పాట్ ఫిక్సింగ్ వివాదం నేపధ్యంలో భారత క్రికెట్ గ్రేట్ వాల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐపీఎల్ ను నిషేధించాలన్న వాదనలో అర్ధం లేదన్నారు. 'మనం సవాళ్ళను ఎదుర్కోవాలి కానీ టోర్నీని రద్దు చేయాలనడం నీళ్ళతొట్టెతో సహా పసిపాపాయిని బయట పారెయ్యడము లాంటిదేనని, అందుకే టోర్నీ రద్దు సమంజసం కాదని' అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ యువ క్రీడాకారులకు ఎంతో మేలు చేసిందనే విషయాన్ని మరువకూడదని గుర్తు చేసారు. వివాదాలు కఠోరవాస్తవాలను బయటపెడతాయని, అందుకే జరిగేదాన్ని ఆశావహ దృక్పధంతో చూడాలని కోరారు.
గతంలో ఫిక్సింగ్ వివాదాలు భారతజట్టును చుట్టుముట్టినా, తాము అంతర్జాతీయ క్రికెట్ ను వీడలేదని, సమస్య నుంచి పారిపోవడం కంటే పోరాడి విజయం సాధించడం ఉత్తమమని సూచించారు. ఎంత కఠోరమైనా సరే స్పాట్ ఫిక్సింగ్ వాస్తవాలు బయటకు రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఐపీఎల్ కు ఈ సీజన్ తరువాత తాను పూర్తిస్థాయిలో క్రికెట్ ఆటనుంచి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగుతానని ద్రవిడ్ స్పష్టం చేశారు.