: సెల్‌తో సూక్ష్మజీవులను కనిపెట్టొచ్చు!
ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్‌ఫోన్ ఉంటోంది. అయితే సూక్ష్మజీవుల గురించిన అవగాహన కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మన ఆరోగ్యానికి హాని కలిగించే వివిధ రకాలైన సూక్ష్మజీవులను మనకు తెలియకుండానే మన దగ్గరికి తీసుకుంటుంటాం. వీటిని గుర్తించే ఆధునిక పరికరాలను మనం దగ్గర ఉంచుకోలేం కదా...! అయితే ఇలాంటి సూక్ష్మజీవులను గుర్తించే మైక్రోస్కోప్ మన చేతిలో ఉంటే... అప్పుడు చక్కగా సూక్ష్మజీవులను గుర్తించవచ్చుకదా...! ఇదే ఆలోచన అర్బనా క్యాంపైన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకు వచ్చింది. దీంతో వారు సెల్‌ఫోన్‌లోనే కొన్ని మార్పులను చేసి ఇలాంటి సూక్ష్మదర్శినిని అమర్చారు.
మనకు చేరువలో ఉండే విషపదార్ధాలు, ప్రోటీన్లు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని గుర్తించేందుకు వీలుగా వీరు సెల్ ఫోన్లో కొన్ని మార్పులను చేశారు. అత్యాధునిక బయోసెన్సర్, కెమెరా, జీపీఎస్ సహాయంతో సూక్ష్మజీవులను గుర్తించే యాప్‌ను వీరు కనిపెట్టారు. ఈ యాప్‌తో నీటి కాలుష్యాన్ని, వ్యాధికారకాలను కూడా గుర్తించవచ్చని వారంటున్నారు. ఈ యాప్‌ను సెల్‌ఫోన్లో అమర్చడం కోసం వారు అందులో అత్యాధునిక సెన్సర్లు, ఆప్టికల్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. అన్నట్టు మీకు కూడా ఇలాంటి యాప్ కావాలనుకుంటున్నారా... అయితే దీని ఖరీదు రూ.10 వేలకు పైగానే ఉంటుందట.