: 'డీఎన్ఏ' చేసిన పెళ్ళి
యువతిని తన అవసరాలకు వాడుకుని వదిలేయాలని భావించిన ఓ వ్యక్తికి డీఎన్ఏ పరీక్ష 'పెళ్ళి' చేసింది. మహబూబ్ నగర్ మొరంబాయికి చెందిన వెంకటలక్ష్మి (19), రంగారెడ్డి జిల్లా కల్మకల్ యువకుడు మల్లేష్ (23) ప్రేమించుకున్నారు. వారిద్దరి సాన్నిహిత్యం తనువులను ఏకంచేసింది. దీంతో, 2011లో వెంకటలక్ష్మి గర్భందాల్చింది. ఇక్కడే మల్లేష్ నిజస్వరూపం బయటపడింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదన్నాడు, పెళ్ళి చేసుకోను పొమ్మన్నాడు. హతాశురాలైన ఈ యువతి చివరికి మహిళా సంఘాలను ఆశ్రయించింది.
మహిళా సంఘం నేతలు ఆ యువకుడిని సంప్రదించగా.. తానే ఆమె గర్భానికి కారణం అని డీఎన్ఏ పరీక్షలో రుజువైతే వివాహానికి ఏమీ అభ్యంతరం లేదని సెలవిచ్చాడు. 2012లో వెంకటలక్ష్మి ఓ బిడ్డను ప్రసవించింది. ఆ శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేస్తే.. మల్లేష్ డీఎన్ఏతో సరిపోలింది. దీంతో, పెళ్ళికి మార్గం సుగమం అయింది. నిన్ననే.. వీరిద్దరి వివాహం మహబూబ్ నగర్ జిల్లా రామేశ్వరం పుణ్యక్షేత్రంలో జరిగింది. పెళ్ళి సమయంలో ఆ పసికందు తన తల్లి ఒడిలో బోసి నవ్వులు రువ్వుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.