: సూపర్ కింగ్స్ తో అమీతుమీకి 'ఇండియన్స్' రెడీ
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న జట్లలో ముంబయి ఇండియన్స్ ఒకటి. సచిన్ టెండూల్కర్ లాంటి బ్యాటింగ్ దిగ్గజం అండగా, రోహిత్ శర్మ, పొలార్డ్, రాయుడు, మలింగ వంటి స్టార్లతో పరిపుష్టంగా ఉన్న జట్టిది. తాజా సీజన్ లోనూ ఫైనల్ చేరడం ద్వారా తన స్టామినా ఏపాటిదో మరోసారి నిరూపించుకుంది. రేపు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగే టైటిల్ సమరంలో చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. నిన్న రాత్రి ఇదే మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై జట్టు తీవ్ర ఉత్కంఠ మధ్య రాజస్థాన్ రాయల్స్ పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (62), అభిజిత్ తారే (32) రాణించడంతో 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, ముంబయి అపురూప విజయాన్ని స్వంతం చేసుకుంది.