: 'తెల్ల'పులి రంగుకు కారణం జన్యువులే!
ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన తెలుపు రంగు పులులు మన భారతదేశంలోనే కనిపిస్తాయి. అయితే ఈ రంగు తేడాకు కారణం ఏమై ఉంటుందా? అని శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. బెంగాల్ టైగర్ల కుటుంబానికి చెందిన పులుల్లో ఈ తెలుపు రంగు రావడానికి కారణం గురించి సాగిన పరిశోధనల్లో, చివరికి చైనాకు సంబంధించిన శాస్త్రవేత్తలు అసలు విషయాన్ని కనుగొన్నారు. పులుల్లో ఇలా తెలుపు రంగు రావడానికి కారణం వాటిలోని ప్రత్యేకమైన జన్యువులేనని తేల్చారు.
చైనాలోని పెంకింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలుపు రంగు పులులపై పరిశోధనలు సాగించారు. తెల్ల పులులు అనేవి సహజసిద్ధమైన జన్యు వైవిధ్యంలో భాగం. కాబట్టి వీటిని సంరక్షించాలని, అయితే ప్రస్తుతం ఇవి కేవలం జంతు సంరక్షణ కేంద్రాల్లోనే ఉన్నాయని ఈ పరిశోధనలో పాల్గొన్న షు-జిన్ లువో తెలిపారు. ఈ పరిశోధనలో చిమెలాంగ్ సఫారీ పార్కులోని పులుల జన్యువులను శాస్త్రవేత్తలు మ్యాప్ చేశారు. ఈ మ్యాప్‌లో ఎస్‌ఎల్‌సీ45ఏ2 అనే ప్రత్యేకమైన జన్యువుపైకి వారి దృష్టి మళ్లింది. వాటిలోని తెలుపు రంగుకు ఇదే కారణమని తేలింది. ఈ జన్యువు కేవలం పులుల్లోనే కాదు, ఆధునిక యూరోపియన్లతోబాటు గుర్రాలు, కోళ్ళు, చేపల్లో కూడా తెలుపు రంగుకు కారణం అవుతోందని ఇప్పటికే పరిశోధనల్లో తేలింది.
దీంతో సహజంగా శాస్త్రవేత్తలు ఈ జన్యువును పరిశీలించి, పులుల్లో కూడా తెలుపు రంగుకు కారణం ఈ జన్యువేనని తేల్చారు. అయితే తెలుపు రంగులో కనిపించే పులుల్లో ఈ రకమైన జన్యువులో ఒకే ఒక మార్పు ఉందని, ఇది ఎరుపు, పసుపు వర్ణాలు విడుదల కాకుండా అడ్డుకుంటోందనే విషయాన్ని వారు గుర్తించారు. ఈ రెండు రంగులను అడ్డుకున్న జన్యుతేడా నలుపు రంగును మాత్రం అడ్డుకోలేక పోవడంతో తెలుపు రంగు పులుల్లో ఒక రకమైన ముదురు రంగు చారలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.