: ప్రేమికుల దినోత్సవం ఎక్కడి నుంచి వచ్చింది?


  'వేలంటైన్స్ డే'ను యువతీ యువకులు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం చూస్తున్నాం. అసలు వేలంటైన్స్, ప్రేమికుల దినోత్సవానికి మధ్య సంబంధం ఏమిటి? 50 ఏళ్ల క్రితం భారత్ లో కనిపించని ఈ 'వేలం' వెర్రి (టైన్స్) నేడు ఇంతలా పాప్యులారిటీ సాధించడానికి.. యువత వేలంటైన్ మత్తులో మునిగిపోవడానికి, ఘన సంబరాలు చేసుకోవడానికి కారణాలు ఏమిటి?  

నేడు జరుపుకుంటున్న వేలంటైన్స్ డే ఎప్పడు మొదలైంది, ఎందుకు, అన్నదానికి కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. దీని వెనుక పలు కథలున్నాయి. మూడోదశాబ్దంలో ఇటలీలోని రోమ్ సామ్రాజ్యంలో 'వేలంటైన్' పేరుతో ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవారు. అప్పటి చక్రవర్తి క్లాడియస్2.. వివాహితులతో పోలిస్తే అవివాహితులు సైనికులుగా బాగా పనిచేస్తారని భావించారు. దాంతో యువకులు పెళ్లిళ్లు చేసుకోరాదనే ఆంక్షలు విధించారు. వేలంటైన్ కు ఇది అన్యాయంగా తోచింది. రహస్యంగా యువకులకు పెళ్లిళ్లు చేయించడం మొదలెట్టాడు. క్లాడియస్ కు ఇది తెలిసింది. దాంతో తన ఆదేశాలను ధిక్కరించినందుకు వేలంటైన్ కు మరణశిక్ష అమలు చేయించారు. 

మరో కథనం ప్రకారం.. వేలంటైన్ అనే అతను జైలు నిర్బంధంలో ఉంటాడు. ఒక రోజు జైలర్ కుమార్తెను చూసి మనసు పారేసుకుంటాడు. తనకు ఉరిశిక్ష అమలు చేసే ముందు ఆమెకు ఓ లేఖ రాసి.. అందులో 'నీ వేలంటైన్' అని ముగిస్తాడు. ఇలా మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వేలంటైన్ మరణానికి గుర్తుగానే వేలంటైన్స్ డే జరుపుకుంటున్నారని సమాచారం.

మరోవైపు సంతానం కోసం జట్టు కట్టడానికి ఫిబ్రవరి నెల అనువైనదిగా వెనుకటి రోమన్ చక్రవర్తులు భావించినట్లు చెబుతారు. అందుకోసం ఒక రోజును నిర్ణయించారని కూడా అంటారు. అధికారికంగా 5వ శతాబ్దంలో పోప్ గెలాసియస్ ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే అని ప్రకటించారు. ఆ తర్వాత దీనిని పెద్దగా జరుపుకున్నట్లు లేదు. మరీ ముఖ్యంగా 20వ శతాబ్దంలోనే వేలంటైన్స్ డే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 


50, 60 ఏళ్ల క్రితం వరకూ క్రైస్తవ మతాన్ని అనుసరించే దేశాలకే వేలంటై్న్స్ డే పరిమితం. కానీ క్రమంగా ప్రపంచీకరణ ప్రభావం, కంపెనీల వ్యాపార కాంక్ష దీనిని విశ్వవ్యాప్తం చేశాయి. యువతీ యువకుల మధ్య ప్రేమకు గుర్తుగా వేలంటై్న్స్ డేని ప్రచారంలోకి తీసుకొచ్చాయి కంపెనీలు. అలా తమ ఉత్పత్తులను విరివిగా విక్రయించుకోవచ్చన్న వాటి ఆలోచన నేడు సఫలీకృతం అవుతోంది. రకరకాల ఉత్పత్తులు, కానుకల రూపంలో ప్రేమికులు ఇచ్చిపుచ్చుకోవడమనే ఆచారం మొదలైంది. ఏటేటా బాగా పెరిగిపోతూ ఉంది. కంపెనీలకు కావాల్సినది ఇదే! ఒక్క వేలంటై్న్స్ డే నాడు భారత్ లో 1400 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని భారత వాణిజ్య మండలి తెలిపింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంకెత వ్యాపారం ఉంటుందో ఊహిస్తే తెలుస్తుంది. 

భారతీయుల కుటుంబ సంబంధాలలో పెనవేసుకున్న ప్రేమ అనిర్వచనీయం. భార్యా, భర్తలు... తల్లీ, బిడ్డలు.. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు.. అన్నా చెల్లెళ్లు.. ఇలా ప్రతీ సంబంధంలోనూ అంతర్లీనంగా ప్రేమ నిండుకుని ఉంటుంది. ఈ అనుబంధాల ప్రేమ శాశ్వతం. దీనిని వ్యక్తీకరించుకోవడానికి ప్రత్యేకంగా మనకు ఒక రోజు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజూ ఉండాల్సినది కనుక. చిత్రమైన విషయమేమిటంటే.. నేడు ఈ బంధాలు, ప్రేమలు పలుచబడుతున్నాయి. అదే సమయంలో లైంగిక పరమైన సంబంధాలతో కూడిన ప్రేమలు వెర్రి తలలు వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News