: వలసదారుల బిల్లును ఆమోదించాల్సిందే: ఒబామా


వలసదారుల సంస్కరణల బిల్లు విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు. రానున్న కాలంలోనూ అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టేందుకు ప్రపంచంలో సూపర్ టాలెంట్ ఎక్కడున్నా ఆకర్షించాల్సిందేనని ఒబామా ఇప్పటికే స్పష్టం చేశారు. వలసదారులను ఆకర్షించేలా నూతన సంస్కరణల బిల్లును ఆమోదించడంలో చట్టసభ సభ్యులు విఫలమైతే తానే సొంతంగా ఓ బిల్లును కాంగ్రెస్ ముందు ఉంచుతానని తాజాగా ఒబామా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందేశాన్ని నలుగురు డెమోక్రాట్ సేనేటర్ల ద్వారా వెల్లడించారు. 

మరోవైపు ఒక కోటీ పదిహేను లక్షల మంది వలసదారుల సమస్య పరిష్కారం కో్సం సంస్కరణలపై కాంగ్రెస్ లోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో కూడిన ద్వైపాక్షిక బృందం చర్చలు జరుపుతోంది. ఈ వలసదారులలో భారతీయులు రెండున్నర లక్షల మంది ఉన్నారు. కోటీ పదిహేను లక్షల మందిలో 58శాతం అక్రమ వలసదారులు లేదా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేనివారేనని సమాచారం. మొత్తానికి రానున్న వారాలలో  ఈ వలసదారుల బిల్లు సభ ఆమోదం పొంది తీరుతుందని ఒబామా ఆశాభావంతో ఉన్నారు. 

అసలైన వలసదారుల సంస్కరణలంటే.. అమెరికాకు వచ్చేందుకు వలసదారులు వేచి ఉండే అవసరం లేని చట్టబద్దమైన విధానమని ఒబామా చెప్పారు. అలాగే అమెరికా పౌరసత్వం పొందేందుకు చక్కటి మార్గం ఉండాలని వివరించారు. అత్యధిక నైపుణ్యాలు ఉన్నవారిని, ఇంజనీర్లను ఆకర్షించే విధంగా విధానాలు ఉండాలని స్పష్టం చేశారు. వీటిని సాకారం చేసేందుకే వలసదారుల సంస్కరణల బిల్లు అవసరం అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News