: ధ్యానంతో దయ పెరుగుతుంది!
ధ్యానంతో దయా స్వభావం పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధ్యానం ద్వారా మన ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనే విషయం మనకు తెలిసిందే. అయితే ధ్యానం చేయడం వల్ల మనలోని భూతదయ అనే స్వభావం బయటపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బౌద్ధంలో అత్యంత పురాతన ప్రక్రియ ధ్యానం. ఈ ధ్యానం మనిషికి భూతదయ నేర్పుతుందని వారు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు కొందరు యువతీ యువకులను ఎంపిక చేసుకుని వారికి ధ్యాన ప్రక్రియలో శిక్షణనిచ్చి, వారి నడవడికను గమనించారు. ఈ సమయంలో వారు వేదనలో, బాధలో ఉండే ఇతరుల కోసం సానుభూతితో స్పందించడాన్ని గమనించారు. ఇలాంటి స్పందించే భావనలను ధ్యానప్రక్రియతో పెంచగలిగినట్టు పరిశోధకులు తెలిపారు. నాడీ సంబంధ వ్యవస్థలో ఎక్కడో సుషుప్తావస్తలో ఉన్న భూతదయ అనే భావనను ధ్యానప్రక్రియ చైతన్యపరుస్తుందనే విషయం తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. తాము ధ్యానప్రక్రియ నేర్పుతున్న వ్యక్తులు శిక్షణలో ఒక దశ పూర్తయ్యేసరికి తమకు తెలియని వ్యక్తుల పట్ల కూడా సానుభూతితో స్పందించడాన్ని స్పష్టంగా గమనించినట్టు వారు చెబుతున్నారు. కాబట్టి చక్కగా ధ్యానం చేస్తూ భూతదయను పెంచుకుందాం!