: కాల్షియంతో కలకాలం ఆరోగ్యం!
మహిళలు ప్రతిరోజూ కాల్షియం తీసుకుంటే పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య కాల్షియం లోపం. ఈ సమస్య వల్ల వారు వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనతతో బాధపడుతుంటారు. అందుకే రోజూ కాల్షియం తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగవుతుందని, వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కెనడాలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. మహిళలు రోజుకు సుమారు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం సప్లిమెంటులను తీసుకుంటే వారు దీర్ఘాయుష్కులై ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తగు మోతాదులో కాల్షియం తీసుకునే మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని, కాల్షియం మహిళలకు సంజీవనిలా ఉపయోగపడుతుందని తమ అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు. 1995-2007 మధ్యకాలంలో సుమారు 9,033 మంది మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. కాబట్టి రోజూ కాల్షియం తీసుకోండి... ఆరోగ్యంగా జీవించండి...!