: 'దేవుడా' నువ్వే దిక్కంటున్న ముంబయి ఇండియన్స్


తొలి క్వాలిఫయర్ లో చెన్నై చేతిలో చిత్తయిన ముంబయి ఇండియన్స్ రేపు రాజస్థాన్ రాయల్స్ తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కు సిద్ధమవుతోంది. కోల్ కతాలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఈ నెల 26న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్.. రాయల్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు తహతహలాడుతోంది. అయితే, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫిట్ నెస్ వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

సచిన్ ఈనెల 13న సన్ రైజర్స్ హైదరాబాద్ పోరు సందర్భంగా గాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలో దిగిన ఈ బ్యాటింగ్ దిగ్గజం 31 బంతుల్లో 38 పరుగులు చేసిన అనంతరం ఎడమ మణికట్టు నొప్పిగా ఉందంటూ మైదానం వీడాడు. అప్పట్నించి సచిన్, గాయానికి చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. రెండ్రోజుల క్రితం ప్రథమ క్వాలిఫయర్ లో చెన్నై చేతిలో ఓటమి సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

తాను రాణించకున్నా జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నిపండంలో సచిన్ మేటి. అందుకే ఆ మహోన్నత క్రికెటర్ త్వరగా కోలుకునేందుకు ముంబయి జట్టు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సచిన్ కు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రత్యేక కసరత్తులు చేయిస్తున్నారు. 'పెద్దన్న' ఉంటే ఎంత పెద్ద జట్టుతోనైనా పోరాడగలమని ఆటగాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు వారందరినోటా 'సచిన్.. త్వరగా కోలుకో' అన్న మాటే వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News