: పిల్లలు బాగా చదవాలంటే...!
పిల్లలు బాగా చదవాలంటే తల్లులు గర్భంతో ఉన్నపుడు అయొడిన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ విషయం ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న సమయంలో తల్లుల్లో అయొడిన్ లోపం వారి పిల్లల ప్రజ్ఞాలబ్ధిపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో తేలింది. సర్రే, బ్రిస్టల్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు బ్రిటన్‌లో సుమారు వెయ్యికిపైగా కుటుంబాలపై విస్తృతమైన అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో అయొడిన్ లోపాన్ని ఎదుర్కొన్న వారి పిల్లలు ప్రాధమిక పాఠశాలల్లో కనబరుస్తున్న ప్రతిభ తీరును విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు.
గర్భిణుల్లో అయొడిన్ లోపం ఉంటే వారి పిల్లల మేధాశక్తి తగ్గుతుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. అందుకే గర్భంతో ఉన్న మహిళలు తమ ఆహారంలో అయొడిన్ ఎక్కువగా లభించే పాలు, ఇతర పాల ఉత్పత్తులను, చేపలను చేర్చుకోవాలని చెబుతున్నారు. శరీరంలో కొన్ని రకాల హార్మోనులకు అవసరమైన అయొడిన్ పరిమాణం పుష్కలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయొడిన్ లోపిస్తే దాని ప్రభావం మెదడుపై పనిచేస్తుంది. దీంతో మెదడుకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి ఆహారంలో తగినంత అయొడిన్ ఉండేలా చూసుకుంటే అప్పుడు శరీరానికి అవసరమైన అయొడిన్ లభిస్తుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు.